కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు ఆదివారం సంయుక్తంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. రెండేళ్లుగా అగ్నిపథ్ పథకంపై అధ్యయనం చేశామని ప్రకటించారు. అంతేకాకుండా ఇతర దేశాల సైన్యాలపై కూడా లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే, మన దేశంలో అమలుకు రెడీ అయ్యామని వారు స్పష్టం చేశారు. అయితే సగటు వయస్సును తగ్గించేందుకే ఇలాంటి సంస్కరణలు తెచ్చామని వారు వివరించారు.
సాయుధ దళాల్లో ప్రస్తుత వయస్సు 30 సంవత్సరాకు పైగా వుందని, ఇలా వుంటే కాస్త ఆందోళనకరమని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ పేర్కొన్నారు. యువకులు గనక సైన్యంలో చేరితే, టెక్నాలజీని సమర్థవంతంగా వాడుతారని, అద్భుతాలు చేసి దేశ రక్షణకు ఉపయోగపడతారని అన్నారు. అలాగే డ్రోన్ల విషయం, సెల్ ఫోన్ల విషయంలోనూ అప్రమత్తంగా వుంటూ.. జాగ్రత్త పడతారన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే అగ్నివీరులకు రిజర్వేషన్లు ప్రకటించామని, అది ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆందోళనల నేపథ్యంలో తెచ్చిన సవరణ ఎంత మాత్రమూ కాదని పూరీ తేల్చి చెప్పారు. రానూ రానూ అగ్నివీరులను సంఖ్యను పెంచుతామని, 1.25 లక్షలకు కూడా చేరుకుంటుందన్నారు.
భారత సైన్యంలో క్రమశిక్షణే అసలు పునాది అని అనిల్ పూరీ పేర్కొన్నారు. దహనాలు, విధ్వంసానికి ఆర్మీలో చోటే లేదని, నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో విధ్వంసం చేయడం అందులో భాగం కాదని తేల్చి చెప్పారు. అయితే.. ఎవరైనా ఆర్మీలో చేరే సమయంలో పోలీస్ వేరిఫికేషన్ కచ్చితంగా ఉంటుందన్నారు. ఎవరిపైనైనా ఎఫ్ ఐఆర్ నమోదు అయితే.. వారు సైన్యంలో చేరలేరని తేల్చి చెప్పారు.
ఇక.. అగ్నివీరులకు ప్రత్యేక శిక్షణ వుంటుందని పూరీ పేర్కొన్నారు. సైన్యం తరపున వచ్చే అన్ని రకాల సదుపాయాలు వుంటాయని, వారు బయటకు వెళ్లిన నెల రోజుల్లోనే వేరే ఉపాధి కూడా చూసుకోవచ్చన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత డిప్లోమా పత్రం ఇస్తామని, అనేక రంగాల్లో పుష్కలంగా అవకాశాలు వుంటాయని అనిల్ పూరీ ప్రకటించారు.