భారత్, చైనా సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు. గతంలో చైనా, భారత్ దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలోనూ జైశంకర్ అచ్చు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సరిహద్దుల్లో చైనా పనుల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు అంత బాగోలేవని తేల్చి చెప్పారు. రెండు పొరుగు దేశాలు కలిసి పనిచేస్తేనే ఆసియా అభివృద్ధి దశలో పయనిస్తుందని స్పష్టం చేశారు.
ఇండియా చైనా కలిసి పనిచేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలోకి వెళ్తుందన్న చైనా నేత జియోపింగ్ చేసిన వ్యాఖ్యలను ఎస్. జైశంకర్ ఈ సందర్భంగా ఉటంకించారు. బ్యాంకాక్ చులలాంగ్‌కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్‌లో భారత్ విజన్‌పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా, ఇండియా కలిసి పనిచేయకపోతే.. ఆసియాకు పెద్ద ఇబ్బందులు తప్పవని, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ దిశలో వెళ్తున్నాయో కూడా చర్చించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
బంగ్లాదేశ్‌తో రోహింగ్యా సమస్యలను చర్చిస్తున్నామని వెల్లడించారు. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు.