నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో తీవ్ర విషాదం జరిగింది. కాలేజీ లో ఇంటర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. కాలేజీలోని స్టాఫ్ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నా… యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామే ఓ టూ వీలర్ పై ఆస్పత్రికి తరలించినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కాలేజీ క్లాస్ రూమ్ లోనే విద్యార్థులను అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య కొడుతున్న విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. గతంలో సాత్విక్ ను లెక్చరర్స్ కొట్టారని, సుమారు 15 రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యాడని పేర్కొంటున్నారు. తమ అబ్బాయి ఆత్మహత్యకు పూర్తిగా కాలేజీ యాజమాన్యమే వైఖరి అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.