సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేయడంపై ఆయన స్పందించారు. తనకైతే ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలూ అందలేదని ప్రకటించారు. తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆర్డర్ లో సర్కార్ పేర్కొందని, 2021 లో తనపై కేసు పెట్టారని ప్రభుత్వం పేర్కొంటోందన్నారు. అయితే కేసు ట్రైల్ లేకుండా సాక్షిలా బెదిరించడం ఎలా వీలవుతుందని సూటిగా ప్రశ్నించారు.
3-1 కింద ఇచ్చిన సస్నెన్షన్ ను సుప్రీం కొట్టేసిందని, మళ్లీ 3-3 కింద ఎలా సస్పెన్షన్ చేస్తారని నిలదీశారు. ఇలా చేయడం పూర్తి చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఒకే అంశంపై ఎవరైనా ఒకరిపై రెండు సార్లు చర్యలు తీసుకుంటారా? ఇవేవీ చట్టం ముందు నిలబడేవి కావంటూ ఏబీ వేంకటేశ్వర రావు అన్నారు. తనపై ఇంత వరకూ ఎలాంటి ఛార్జ్ షీట్ నమోదు కాలేదని ప్రకటించారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పై కేసులున్నాయి.. ఛార్జిషీట్లూ వున్నాయని, ఆమెకు వర్తించని నిబంధనలు నాకెలా వర్తిస్తాయి? అంటూ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.
ఏసీబీ అధికారులు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఏబీ వేంకటేశ్వర రావు అన్నారు. రూపాయి కూడా అవినీతి జరగని దగ్గర అవినీతి కేసు పెట్టడం ఏంటని అన్నారు. కొంత మంది అధికారులు చేసే తప్పులకు ప్రభుత్వం నింద మోయాల్సి వస్తోందన్నారు. కొన్ని శక్తులు, వ్యక్తులు తనను టార్గెట్ చేశాయని, ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు అన్నారు.
మరోసారి సస్పెన్షన్ వేటు వేసిన ఏపీ ప్రభుత్వం
ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై జగన్ సర్కార్ మరో మారు సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, అలాగే గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉంటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేసినట్లు సీఎస్ సమీర్ శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీ వేంకటేశ్వర రావు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ గా పనిచేస్తున్నారు.