భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం.. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D2 రాకెట్ ప్రయోగించబడింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. గతేడాది ఆగస్టు 7న ప్రయోగాత్మకంగా నిర్మించి, ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన క్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది. లోపాలను సరిదిద్దిన తర్వాత ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ను రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి వుంటుంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి, 124 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు.