పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రమే చేపడుతోందని, అందుకే కేంద్రం నుంచి నగదు బదిలీ కుదరదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ లోక్ సభలో లిఖిత పూర్వకంగా ప్రకటించారు.
నేరుగా నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని పేర్కొన్నారు. లోక్ సభలో వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పై విధంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తాము చెల్లిస్తూనే వున్నామని గుర్తు చేశారు. భూసేకరణ, పునరావాసంపై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో జాప్యం జరగలేదన్నారు.
భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకూ రూ. 3779.5 కోట్లు బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించగా రూ. 3431.59 కోట్లు తిరిగి చెల్లించామని గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. సహాయ పునరావస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2267.29 కోట్లకు బిల్లులు సమర్పించగా ఇప్పటివరకు రూ. 2110.23 కోట్లు తిరిగి చెల్లించడం జరిగిందని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో విభజన చట్టంలోని హామీలపై ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని వైసీపీ ఎంపీలు బుధవారమే వ్యాఖ్యానించారు. విభజన జరిగి పది సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు వాటి గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్నా.. బడ్జెట్‌లో విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావన లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పోలవరం నిధులపై, ప్రత్యేక హోదాపై, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల పెండింగ్, ఆర్థిక లోటు, రైల్వే కారిడార్, స్టీల్ ఫ్యాక్టరీకి చేస్తామన్న సాయంపై బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.