జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సంచలన నినాదం ఇచ్చారు. వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతోనే తాము ఎన్నికలకు వెళ్తామని సంచలన ప్రకటన చేశారు. అయితే… తమ వ్యూహాలు తమకు వున్నాయని, పరిస్థితులను బట్టి వ్యూహాలు మాత్రం మారుతుంటాయని అన్నారు. సోమవారం జనసేన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఇప్పటి వరకూ అధికారం చూడని అన్ని వర్గాలను కలుపుకొని అడుగులు వేస్తామని, సందర్భం, అవసరానికి అనుగుణంగా తమ వ్యూహం మారుతుంటుందని పేర్కొన్నారు. ఏ వ్యూహం వేసినా అంతిమ లక్ష్యం మాత్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే అని తేల్చిచెప్పారు.
ఇక ఈ మీడియా సమావేశం సందర్భంగా టీఆర్ఎస్ మాటను కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తే టీఆర్‌ఎ్‌సను కాంగ్రె్‌సలో విలీనం చేస్తానని కేసీఆర్ నాడు ప్రకటించారని, సోనియాగాంధీ ఇంటికి కుటుంబంతో వెళ్లి మరీ మనస్ఫూర్తిగా కలిపేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఒంటరిగా పోటీ చేశారని, అలాగే.. ప్రధాని మోదీ టీడీపీని రానివ్వరు.. చంద్రబాబును కలవరని అన్నారు. మొన్న ఇద్దరూ కలిశార అని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని ఈ సందర్భాలను ఉటంకించారు.
పీఏసీ సమావేశంలో ప్రధానంగా నాలుగు రాజకీయ తీర్మానాలు ఆమోదించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అసలైన సాధికారత, వక్ఫ్ ఆస్తుల సంరక్షణ, దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. కాగా, సెప్టెంబరు 12వ తేదీన నుంచి తలపెట్టిన అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు జనసేన మద్దతు కావాలని.. రైతులు కోరగా, పవన్‌కల్యాణ్ సమ్మతించారు. యాత్రలో తమ నేతలు భాగస్వాములవుతారని పవన్ రైతులకు హామీ ఇచ్చారు.