జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) దారుణ హత్యకు గురయ్యారు. లిబరల్ డెమోక్రెటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో వుండగా.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన వేదికపైనే కుప్ప కూలిపోయారు. అత్యంత సమీపం నుంచే దుండగుడు కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన శ్వాస తీసుకోవడం లేదని, ఆయన స్పందించడం లేదని వైద్యులు పేర్కొన్నారు. చివరికి ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు మాజీ ప్రధాని షింజోపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో శనివారం ఒక్క రోజు సంతాప దినాలను పాటిస్తున్నామని మోదీ ప్రకటించారు. భారత- జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎప్పుడూ ఇష్టం చూపేవారని మోదీ గుర్తు చేసుకున్నారు.