ఎన్డీయే తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. బెంగాల్ గవర్నర్ గా వున్న జగదీప్ ధన్కర్ తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనూహ్యంగా జగదీప్ ధన్కర్ పేరు తెరపైకి తెచ్చారు. బెంగాల్ సీఎం మమతకు, ధన్కర్ కు అస్సలు పడదు. ఈ కారణంగానే ధన్కర్ దేశ రాజకీయాల్లో అత్యంత ఫేమస్ అయ్యారు. శనివారం ధన్కర్ ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.
ఈ వార్త అందరికీ తెలిసిందే. అయితే ఇది రొటీన్ సమావేశం అనుకున్నారు. ఇంతలోనే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై. పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా తన కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ రాజీనామా చేయడంతో ఆయనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అని అందరూ భావించారు. కానీ.. చివరికి ధన్కర్ పేరు తెరపైకి వచ్చింది.