తమ కుటుంబంలో ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్న కల్యాణ్ రామ్ అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. అన్న తన కంటే ఇండస్ట్రీలో సీనియర్ అని చెప్పుకొచ్చాడు. ఆదివారం జరిగిన ‘అమిగోస్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఆయన మాస్ సినిమాలు ఎప్పుడు చేస్తారా అని అనుకునేవాడిని. ఫైనల్‌గా బింబిసారతో ఆకలి తీర్చాడు. మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు అని అన్నాడు.
తాను జై లవకుశ లో త్రిపాత్రిభినయం చేశానని, అది ఎంత కష్టమో తెలుసని ఎన్టీఆర్ అన్నాడు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారని, అద్భుతంగా నటించారు. అన్న కల్యాణ్ రామ్ కెరీర్ లో అమిగోస్ ఓ మైలురాయిగా నిలుస్తుందని అన్నాడు. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చేశారని, ఆయన తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్త్తానని చెప్పారని గుర్తు చేశారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారని, సినిమా పట్ల ఓ మనిషికి ఇంత ప్రేమ, తాపత్రయం ఉంటుందా అనేది రాజేంద్రను చూశాకే తెలిసిందని అన్నాడు.
మొదటిసారి మనుషుల్ని పోలిన మనుషుల కథతో ఈ వినూత్నమైన థ్రిల్లర్ ట్రై చేశాం. నాకిలాంటి కథ ఇచ్చినందుకు రాజేంద్రకు థ్యాంక్స్. ‘బింబిసార’ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనుకున్నప్పుడు రాజేంద్ర ఈ కథ తెచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ఎవరినీ నిరుత్సాహపరచదు’’ అని అన్నారు.