నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో రాజకీయ హైటెన్షన్ కొనసాగుతోంది. కొల్లాపూర్ వేదికగా జరిగిన అభివృద్దిపై బహిరంగ చర్చ విషయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరిగాయి. అభివృద్దిపై స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని మాజీ మంత్రి జూపల్లి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు.
చౌరస్తాకు ఎందుకు? ఏకంగా జూపల్లి ఇంటికే వస్తానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఉదయం నుంచే ఇరు నేతల ఇళ్ల వద్దకు చేరుకున్నారు. చర్చలకు రెడీ అంటూ ప్రకటించారు.
దీంతో కొల్లాపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహిరంగ చర్చలకు అనుమతి లేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా అటు జూపల్లిని, ఇటు స్థానిక ఎమ్మెల్యేను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు. వారి వారి ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులెవరైనా.. రోడ్లమీదికి వస్తే.. కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.