కోర్టు పనివేళలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లలు 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు 9 గంటలకు ఎందుకు విధులు ప్రారంభించకూడదు? అంటూ సూటిగా ప్రశ్నించారు. సాధారణంగా కోర్టు వేళలు ఉదయం 10 నుంచి ప్రారంభమవుతుంటాయి. అయితే.. జస్టిస్ లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఓ కేసును ఉదయం 9:30 నిమిషాలకే ప్రారంభించేసింది. ఈ సందర్భంగానే జస్టిస్ లలిత్ పై వ్యాఖ్యలు చేశారు.
చిన్నారులు 7 గంటలకే పాఠశాలలకు వెళ్తున్నారు కదా. న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ ఉదయం 9 గంటలకే విధులు ప్రారంభించాలి. 11:30 గంటల తర్వాత ఓ అర్ధగంట విశ్రాంతి తీసుకున్నా పర్లేదు. 2 గంటలకు పని ముగించుకోవచ్చు. దీని వల్ల సాయంత్రం ఫైళ్లు చదవడానికి కాస్త సమయం దొరుకుతుంది కదా.. అని జస్టిస్ లలిత వ్యాఖ్యానించారు.