సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూయార్క్ విమానాశ్రయంలో దిగగానే.. పలువురు ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అమెరికాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో జస్టిస్ రమణ దంపతులు పాల్గొన్నారు. అమెరికాలో వుంటున్న తెలుగు వారి జీవితాన్ని చూస్తుంటే తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితంగా వుందన్న విశ్వాసం ఏర్పడిందన్నారు.
మాతృ భాష గురించి జస్టిస్ ఎన్వీ రమణ అమెరికా వేదికగా గొప్పగా చెప్పుకొచ్చారు. మాతృ భాషలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పుకొచ్చారు. లా మాత్రమే ఇంగ్లీష్ మాధ్యమంగా చదివా. మన భాషను, సంప్రదాయాన్ని మరిచిపోతే జాతి అంతరించిపోయే ఛాన్స్వుంది. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి వచ్చింది. మాతృ భాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహే. నేను ఆ భాషలోనే చదివి ఈ స్థాయికి వచ్చాను. తెలుగు అనేది కేవం భాష కాదు. జీవన విధానం. మన భాషతో పాటు పరాయి భాషను కూడా గౌరవించాలి. ఇంట్లో పిల్లలతో పెద్దలు తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నా అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.