విజయవాడ లో కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టు కాంప్లెక్స్ లో అందరూ కలిసి ఓ మొక్కను నాటారు. తాను శంకుస్థాపన చేసిన భవనాన్ని తానే ప్రారంభించడం సంతోషంగా వుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రకరకాల కారణాలతో ఈ నిర్మాణం ఆలస్యమైందని, న్యాయ వ్యవస్థకు అదనపు నిధుల విషయంలో కేంద్రం నుంచి వ్యతిరేక వచ్చినప్పుడు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు ప్రకటించారు. పెండింగ్ కేసులు విషయంలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలనే తపన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై వుందని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామని, భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని కోరారు. భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడే ఇబ్బందుల్లోకి పడిపోతుందని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థను పటిష్ఠ పరిచడానికి ప్రజల భాగస్వామ్యం అత్యావశ్యకమని పేర్కొన్నారు.
ఇక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మాట్లాడారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ నేడు ఓ ఉన్నత స్థాయిలో వుండి… కోర్టు భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా వుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2013లో జస్టిస్ ఎన్వీ రమణగారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం.ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని సీఎం జగన్ అభివర్ణించారు.