తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దాదాపు 9 నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు. ఇక.. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇక.. ఇంత కాలం హైకోర్టు సీజేగా వున్న సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఉండటంతో సీజేగా పదోన్నతి పొందారు.
జస్టిస్ భూయాన్ 1964 ఆగస్టు 2 న అసోంలోని గౌహతిలో జన్మించారు. తండ్రి సుచేంద్ర నాథ్ అసోం అడ్వకేట్ జనరల్ గా సేవలు అందించారు. జస్టిస్ ఉజ్జల్ ప్రాథమిక స్థాయి నుంచి ఎల్ ఎల్ ఎం వరకూ గౌహతిలో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అగర్తల, షిల్లాంగ్, కొహిమా, ఈటానగర్ బెంచీల ముందు వాదనలు వినిపించారు. 2002 నుంచి 2006 వరకూ మేఘాలయలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ గా 2005 నుంచి 2009 వరకూ అరుణాచల్ ప్రదేశ్ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు.ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేస్తూ 2021 అక్టోబర్ లో తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.