కళాతపస్వి కే విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో కే విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు. తమ అభిమాన దర్శకుడిని చివరి సారిగా చూసుకోడానికి అభిమానులు పెద్ద మొత్తంలో శ్మశాన వాటికకు తరలివచ్చారు.
అంతకు ముందు ఆయన నివాసంలో ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు వచ్చి, భౌతికకాయానికి నివాళులు అర్పించారు. విశ్వనాథ్ తో తమకు వున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకి నివాళిగా నేడు జరగనున్న అన్ని సినిమా షూటింగులను స్వచ్ఛందంగా నిలిపివేసిట్లు తెలిపింది.