నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద కొనసాగుతూనే వుంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తోంది. అయితే.. ప్రస్తుతం వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో కూడా 3 లక్షల క్యూసెక్కులు నడుస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 692 అడుగులకు చేరుకుంది. అయితే.. ఈ ప్రాజెక్టు విషయంలో టెన్షన్ మాత్రం కొనసాగుతూనే వుంది. ఎన్ని టీఎంసీల నీరు ప్రవహిస్తుందనేది కూడా లెక్కించలేని స్థితికి ఈ ప్రాజెక్టు చేరుకుంది. అర్ధరాత్రికి కడెం జలాశయ నీటి సామర్థ్యం 700 అడుగులకు చేరుకుంది.
దీంతో అధికారులు సైరన్ మోగించారు. కడెం ప్రాజెక్టుకు దగ్గరే వున్న పాత కడెం గ్రామంలోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కన్నాపూర్, కొందుకూరు, పాండవాపూర్, అంబారీపేట, బెల్లాల్, మున్యాల, రాంపూర్, బూత్కురు, దేవునిగూడెం, గొడిసిర్యాల్ గ్రామాల ప్రజలను అత్యవసరసంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. వరద మరింత పెరగడంతో 18 గేట్లలో 17 గేట్లను తెరిచేశారు. సాంకేతికత కారణంగా ఒక్క గేటును తెరవలేక పోయామని అధికారులు ప్రకటించారు.
మరో వైపు కడెం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరుకుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా దీనిపై ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం కాస్త ఇన్ ఫ్లో తగ్గినా… సాయంత్రం మళ్లీ ఒక్క సారిగా పెరిగిపోయింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో ప్రాజెక్టుకు కుడి పక్కన వున్న కట్టకు గండి పడింది. వెంటనే 120 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పంపించారు.