ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సరిగ్గా 8:10 నిమిషాలకు కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ కవితను విచారించింది. ఇన్ని గంటల పాటు ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయంలోనే వుండటంతో ఆమెను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి. చివరికి.. కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చి… నేరుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. అయితే… ఈ నెల 16 న మళ్లీ విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ లీకులు బయటకు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.
