కేశినేని బ్రదర్స్ మధ్య ప్రస్తుతం వార్ నడుస్తోంది. ఎంపీ నకిలీ స్టిక్కర్ తో టీఎస్0డబ్ల్యూ 7777 వాహనం తిరుగుతోందని విజయవాడ, హైదరాబాద్ పోలీసులకు ఎంపీ నాని ఫిర్యాదు చేశారు. కారుకు అతికించుకొని, ఎవరంటే వారే తిరుగుతన్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో తన సోదరుడు కేశినేని చిన్ని వాడే వాహనం కూడా వుండటం విశేషం. దీంతో అన్నదమ్ముల మధ్య వార్ మొదలైందని అంటున్నారు. అయితే.. ఎంపీ కేశినేని నాని ఇచ్చిన ఫిర్యాదుపై ఆయనపై సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. ఇదో చిల్లర వివాదమని, ఇందులోకి ఎంపీ నాని తనను లాగడం బాధాకరమని అన్నారు. ఈ స్టిక్కర్ ఎవరిదో, ఏంటో విచారణలో తేలుతుందన్నారు.
టీడీపీలో తాను చిన్న కార్యకర్తనని తెలిపారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆటోనగర్ ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను, దాన్ని కూడా వివాదంలోకి లాగారని అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ నాని తనకు శత్రువు కాదని, తమ సొంత అన్నయ్య అన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తానుగా ఎంపీగా బరిలోకి దిగుతానని చెప్పలేదని, టిక్కెట్ కూడా అగదలేదని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయమంటే అది చేస్తానని అన్నారు. ప్రస్తుతం తన కారుపై స్టిక్కర్లేదని, హైదరాబాద్ పోలీసులు తన కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని ప్రకటించారు. తనపై రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయవచ్చని, కుటుంబీకులను లాగొద్దని కేశినేని చిన్ని అన్నారు.