ఖలిస్థాన్ సానుభూతిపరుడు, సిక్కు రాడికల్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య ఈ పరిణామం జరిగింది. దాదాపు 100 కార్లతో ఛేజ్ చేసి మరీ అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులను కూడా అరెస్ట్ చేశారు. ఈ మేరకు పంజాబ్ స్పెషల్ పోలీస్ టీమ్.. అమృత్‌పాల్ సింగ్, ఆయన అనుచరుల కోసం గాలించి, చాకచక్యంగా పట్టుకుంది. మొత్తం ఏడు జిల్లాల్లో అమృత్‌పాల్, ఆయన అనుచరుల కోసం చేజింగ్ కొనసాగింది.
ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు అమృత్‌పాల్ అనుచరులు అరెస్టయ్యారు.ఈ క్రమంలో అమృత్‌పాల్ పారిపోయి జలంధర్ జిల్లా, షాకోట్ తాలూకా, మెహత్‌పూర్ గ్రామంలో దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో మెహత్‌పూర్ చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు ఉపక్రమించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సేవలు నిలిపివేయబడుతాయని తెలిపారు.
జీ 20 సదస్సు ముగిసిన తర్వాతి రోజు పంజాబ్ పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. పకడ్బందీ వ్యూహంతోనే అరెస్ట్ చేశారు. జలంధర్ షాకోట్ కి వస్తున్నాడన్న పక్కా సమాచారం అందింది. దీంతో రహదారును దిగ్బంధించారు. పకడ్బందీగా ఆయన వున్న గ్రామాన్ని ముట్టడించారు పోలీసులు. అయితే.. ఈ క్రమంలో అమృత్‌పాల్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే పోలీసులు 100 కార్లతో ఆయన్ని ఛేజ్ చేసి, జలంధర్ లోని నాకోదర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు తనను పోలీసుల నుంచి రక్షించాలంటూ ప్రజలను వేడుకుంటున్నాడు అమృత్ పాల్ సింగ్. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.