ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అమృత్‌పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగంపై అమృత్‌పాల్‌పై మరో కేసు నమోదైంది. మూడు రోజులైనా అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ దొరకడం లేదు. అతను పరారీలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.
ముందస్తు జాగ్రత్తగా నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవల గడువును ఈనెల 21వ తేదీ వరకూ పొడిగించారు. ప్రజా భద్రత దృష్ట్యా.. మొబైల్ నెట్‌వర్క్‌లు అందించే వాయిస్ కాల్స్, బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ మినహా అన్ని ఎస్ఎంఎస్ సర్వీసులు, డాంగిల్ సర్వీసులు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు పంజాబ్ హోం, న్యాయశాఖ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పలు క్రిమినల్ కేసులున్న ఆ సంస్థకు వ్యతిరేకంగా శనివారం రాష్ట్రమంతటా భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ 78 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రధాన నగరాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
అమృత్‌పాల్ కాన్వాయ్‌కి చెందినదిగా భావిస్తున్న ఓ కారును జలంధర్ జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు, ఒక వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు లభ్యమయ్యాయి. వీటిని తమ నాయకుడే కొనుగోలు చేశాడని పోలీసులకు పట్టుబడిన అమృత్‌పాల్ అనుచరుడొకరు వెల్లడించాడు. దీంతో అక్రమ ఆయుధాల కోణంలో అమృత్‌పాల్, అతని అనుచరులు కొందరిపై పోలీసులు కొత్తగా రెండు కేసులు నమోదు చేశారు.