టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్లెక్సీల వివాదం ఇంకా రగులుతూనే వుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీల విషయంపై అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గాల సందర్భంగా తాము ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే… తమకు పోటీగా మాత్రమే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టిందని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రొటోకాల్ పాటించకపోయినా పర్లేదని, చిల్లరగా మాత్రం వ్యవహరించవద్దని హితవు పలికారు.
టీఆర్ఎస్ పనిగట్టుకొని, కావాలనే తమకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెడుతున్నారని, ర్యాలీలు తీస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పూర్తి అభద్రతా భావంతో వుందని, అందుకే అహంకారంగా వెళ్తోందని దుయ్యబట్టారు. అధికారం చేతిలో వుందని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.