టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను చూసి దేశమంతా పాఠం నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారని, వారి నుంచి ఏం నేర్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప్ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి ఏమీ నేర్చుకోలేమని ఎద్దేవా చేశారు. అవినీతిమయ రాజకీయాలను నేర్చుకోవాలా? కుటుంబ రాజకీయాలను నేర్చుకోవాలా? మజ్లిస్ తో పొత్తును చూసి నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? అంటూ కిషన్ రెడ్డి ఒక్కసారిగా ప్రశ్నల పరంపర సంధించారు.
సీఎం కేసీఆర్ గత 8 సంవత్సరాలుగా సచివాలయానికే వెళ్లలేదని చురకలంటించారు. 8 సంవ్సరాలుగా ప్రజలకు సీఎం కేసీఆర్ అందుబాటులో లేనే లేరని, ఫామ్ హౌజ్ లోనే వుంటూ పరిపాలన చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలన, ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని, తమను ఆశీర్వదించాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులను వెంబడి పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.