మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో…. మునుగోడులోనూ అవే ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ లో బీజేపీ భయం బాగా పట్టుకుందని, అందుకే కేంద్ర మంత్రి అమిత్ షా సభకు ఒక రోజు ముందే సీఎం కేసీఆర్ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభా ఏర్పాట్లను ఈటల రాజేందర్ తో కలిసి కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబం మొత్తం కుర్చీ వేసుకొని కూర్చున్నా…. మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని అన్నారు. హుజూరాబాద్ గెలుపును ఓర్వలేకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మాటలగారడీ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఉపఎన్నికలు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శమో కేసీఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపును ఓర్వలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు కేసీఆర్ చాలా ఎత్తులు వేశారని, కొత్త పథకాలను కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయన్నారు. మాయమాటలతో ప్రజలను గారడీ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని కిషన్ రెడ్డి అన్నారు.