తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పని ఎమ్మెల్సీ కవిత చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కవిత తెలంగాణ ప్రజలు సిగ్గుపడే పనిచేశారని, తెలంగాణ పరువునే తీసేశారంటూ మండిపడ్డారు. న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటికే బెల్ట్ షాపులు పెట్టిన ఘనత కేసీఆర్ ది అని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని ప్రధాన వనరుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత.. రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తమను టార్గెట్ చేశారని అన్నా చెల్లెళ్లు పదే పదే మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ టార్గెట్ చేసేటంత కుటుంబమా వారిది? అంటూ కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేకుండా మొదటి ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు గుర్తుకు రాలేదని, రాజ్యసభకు ఒక్క మహిళను కూడా పంపని చరిత్ర కేసీఆర్ దేనని విరుచుకుపడ్డారు. కేంద్రంలో అనేక మంది మహిళా మంత్రులు వున్నారని, ఏకంగా ఆర్థిక మంత్రే మహిళా మంత్రి అని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అయితే… కవిత చేసిన అక్రమ మద్యమ వ్యాపారానికి, తెలంగాణకు, తెలంగాణ మహిళలకు ఎందుకు లింక్ పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ వ్యాపారం మహిళల కోసం చేశారా? అంటూ కిషన్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ అక్రమ వ్యాపారం చేయకపోతే కల్వకుంట్ల కుటుంబం ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా… కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం లేకపోతే… కవిత లక్షల రూపాయల ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.