కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ కిషన్ రెడ్డి ఆ లేఖలో కోరారు. తెలంగాణలో రోజు రోజుకీ కార్మికుల వైద్య అవసరాలు పెరిగిపోతున్నాయని, దీనిని కేంద్రం గుర్తించి.. ఈఎస్ఐ సేవలను విస్తరించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
రామ గుండంలోని 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. భూమి కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. 5 ఎకరాల భూమి కేటాయించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు.