మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు తనను ఓడించడం కాదని, 2024 ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని సవాల్ విసిరారు. చిన్నప్పటి నుంచి గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే వున్నారని ఎద్దేవా చేశారు.
తనను ఓడించినా, గెలిపించినా గుడి నియోజకవర్గ ప్రజలే చేయగలరని అన్నారు. సొంత కొడుకునే గెలిపించుకోలేని దుస్థితి చంద్రబాబుది అంటూ దెప్పిపొడిచారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే తన పార్టీని గెలిపించుకోలేని అసమర్థుడు చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా, ఎక్కడైనా పెట్టుకోవచ్చని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగులోనైనా వేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన నేపథ్యంలో నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తమ ఆస్తి అని, పార్టీ పెట్టిన దేవుడు అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు.వచ్చే ఎన్నికల్లోనూ తాను గుడివాడ నుంచే గెలుస్తానని, కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని శపథం చేశారు.