ముఖ్యమంత్రి కేసీఆర్ పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మునుగోడుకు నిధులే ఇవ్వని సీఎం… ఏ మొహం పెట్టుకొని మునుగోడు సభకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ 8 సంవత్సరాలలో మునుగోడుకు ఒక్క రూపాయి కూడా రాలేదని మండిపడ్డారు. నిధులు ఇవ్వనందుకు గాను మునుగోడు ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే… మునుగోడులో అడుగుపెట్టాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో, మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో చెప్పాలని అన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని అసెంబ్లీ వేదికగా అడిగినా… సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్న శ్రద్ధ డిండి ప్రాజెక్టు పై ఎందుకు లేదని ప్రశ్నించారు.
రాజ్‌గోపాల్ రెడ్డి పేరు వస్తుందనే అక్కసుతో మునుగోడుకు పైసా నిధులివ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ది జరగదని కేసీఆర్ చెప్పకనే చెప్పారన్నారని కోమటిరెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగసభ ఉంటుందని ముందే చెప్పామని.. అయినా కుట్రపూరితంగా సీఎం కేసీఆర్ శనివారం సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ బందీ అయిందని.. ప్రస్తుతం విముక్తి కోరుకొంటోందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుతరాలకోసం సరైన నిర్ణయం తీసుకొని ఉపఎన్నికలో కేసీఆర్ కి బుద్ది చెప్పాలని మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.