తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ తనను తీవ్రంగా అవమానిస్తున్నారని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు చేసేస్తున్నారని, తన అనుచరులతో అవమానకంగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
చండూరు సభ వేదికగా తనపై చేసిన కామెంట్స్ ను కూడా అధినేత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో తాను వేదిక పంచుకోలేనని కోమటిరెడ్డి అధినేత్రికి తెగేసి చెప్పారు. రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీ భూస్థాపితం అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాల మేరకు కొత్త పీసీసీ చీఫ్ ని నియమించాలని అధినేత్రిని కోరారు. ఇక… మునుగోడుపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక ఆదేశించారు. అయితే… తాను ఈ సమావేశానికి హాజరు కాలేనని కో్మటిరెడ్డి స్పష్టం చేశారు.