మునుగోడులో జరుగుతున్న ఎన్నికల పోటీ పార్టీల మధ్య కాదని, అవినీతిపై, కేసీఆర్ అరాచకాలపై జరుగుతున్న ఉప ఎన్నిక అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అరాచక పాలన పోవాలటే మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర లో నిలిచిపోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తన రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, తన రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారని పేర్కొన్నారు. వీటితో పాటు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారని, ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని అన్నారు.
తన రాజీనామాతో ఇప్పుడు ఒక్కో గ్రామపంచాయతీకి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే కు సీఎం ఆపాయిట్మెంట్ ఇవ్వరు. కానీ ఉపఎన్నికలు వస్తే కోట్లు కుమ్మరించి గెలవాలని చూస్తారని మండిపడ్డారు. రాజకీయాల్లో తన ఎదుగుదలను ఓర్వలేక కాంట్రాక్ట్ ల కోసం బీజేపీలోకి జాయిన్ అయ్యారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నెల 20న సీఎం కేసీఆర్ (CM KCR) హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడును పట్టించుకోనివారు.. రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.