మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వుందని నొక్కి వక్కాణించారు. మునుగోడులో జరిగిన బీజేపీ సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపి, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. మోసకారి, దగాకోరు, నయవంచన చేసే వ్యక్తి చేతిలో తెలంగాణ చిక్కుకుందన్నారు.
పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని రాజగోపాల్ అన్నారు. తాను అమ్ముడుపోయానని కొందరు విమర్శలు చేస్తున్నారని, తనను కొనే శక్తి ఎవ్వరికీ లేదని అన్నారు. కేసీఆర్ చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానని, తనకు మునుగోడు అంతా మద్దతివ్వాలని కోమటిరెడ్డి కోరారు. మునుగోడు ఉప ఎన్నిక ఓ పార్టీ కోసం వచ్చింది కాదని, తెలంగాణ భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవం కోసం వచ్చిన ఉప ఎన్నిక అని అభివర్ణించారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.