వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ కుటుంబంలో తనను భాగస్వామిగా చేసినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమని, అందరి సలహాలు తీసుకున్నాకే టీడీపీలో చేరానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమను నమ్ముకొని తమతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వివరించారు.
ఇక.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 2023లో 23వ తేదీన 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్క్రిప్ట్ అని అభివర్ణించారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుందన్న చంద్రబాబు.. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని.. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారని చంద్రబాబు ప్రశ్నించారు.