గన్నవరంలో జరుగుతున్న పరిణామాలపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టీడీపీ శ్రేణుల చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అయితే… టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో విధులు నిర్వర్తిస్తున్న గన్నవరం సీఐ కనకరావు తలకు గాయమైందని ఎస్పీ తెలిపారు. ఇక… టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన విషయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. గన్నవరం పీఎస్ పరిధిలో 144 సెక్షన్ వుంటుందని ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసనలు చేపట్టవద్దని సూచించారు.
మరోసారి గన్నవరం రణరంగంగా మారిపోయింది. ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి, దొరికిన వారిని కూడా బాదారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు, నేతలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే టీడీపీ కార్యాలయం ఆవరణలో వున్న కారుపై పెట్రోల్ పోసి, వంశీ వర్గీయులు నిప్పంటించారు. అయితే… ఇది ఆరంభం మాత్రమేనని, వంశీని విమర్శిస్తే మరింత దాడులు చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది.
అయితే… వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు బయల్దేరారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేవారు. దీంతో వైసీపీ వర్గీయులకు, టీడీపీ వర్గీయులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. అది కాస్త తీవ్ర ఘర్షణకే దారితీసింది. ఆ తర్వాత వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడులు చేయడం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం జరిగిపోయింది. అంతేకాకుండా కార్యాలయం ముందున్న ఓ కారుకు కూడా నిప్పు పెట్టేశారు. దాదాపు 50 మంది వంశీ వర్గీయులు వచ్చి టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు.