గ్యాస్ సిలిండర్ ధర అడ్డగోలుగా పెంచిన కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుట్టిందని అన్నారు. 8 సంవత్సరాల మోదీ పరిపాలనలో సుమారు 170 శాతం పెంపుతో ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా మోదీ సర్కార్ ప్రపంచ రికార్డు సృష్టించిందని విమర్శించారు.
తాజాగా పెంచిన 50 రూపాయలతో ఈ యేడాది కాలంలోనే 244 రూపాయల మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోదీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 410 రూపాయలుగా వున్న సిలిండర్ ఇవాళ సుమారు మూడు రేట్లు పెరిగిందన్నారు. దేశ చరిత్రలో గ్యాస్ ధర ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, 1100 రూపాయలకు పైగా గ్యాస్ రేటు చేరడం బీజేపీ అసమర్థ పాలనకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రతి కుటుంబానికి బడ్జెట్ భారంగా మారుతోందని కేటీఆర్ అన్నారు. బీజేపీ అసమర్థ పాలన వల్లే ప్రతి వస్తువు ధర ఆకాశానికి అంటుతోందన్నారు. దేశ ప్రజలు ఇంత బాధపడుతున్నా… మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని కేటీఆర్ అన్నారు.