తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లే దేశ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడిందని, 30 ఏండ్లలో ఎన్నడూ లేనవిధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపైకి తమ ప్రభుత్వ యంత్రాంగాలను ఉసిగొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాధారణ ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితమేనని కేటీఆర్ విమర్శించారు.అనాలోచిత డీమానిటైజేషన్ (నోట్ల రద్దు), జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చతికిలపడిందని, దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అన్ని కష్టాలకు ఒకే మందుగా పేర్కొన్న డిమానిటైజేషన్ వల్ల కొట్ల మంది ఉపాధితోపాటు, వందల మంది ప్రాణాలను కోల్పోయారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.