హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లోని ఎత్తైన, భారీ భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. సికింద్రాబాద్ లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో జీహెఛ్ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతి కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్రమ భవనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించనుంది. అలాగే అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే అగ్నిపకశాఖ ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలి నిర్ణయానికి వచ్చారు. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్ మెంట్లలో ఈ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అయితే.. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలని కూడా కీలక సూచనలు చేశారు.
ఇక… హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో భారీ అంతస్తుల భవన నిర్మాణాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని కేటీఆర్ సూచించారు.ఫైర్ సేఫ్టీ లేని భవనాల గుర్తింపు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సెల్లార్లపై అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డెక్కన్ స్పోర్ట్స్ మాల్‌లో గల్లంతైన మృతులకు కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.