తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబసభ్యులే.. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ అని స్పష్టం చేశారు. బరాబర్ ఇది కుటుంబ పాలనే.. కాదని ఎవరు అంటారో మేం కూడా చెబుతామంటూ వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో.. ఏ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్లు ఇచ్చి ఒక పెద్ద కొడుకులా నిలబడ్డారని, ఒక్క కేసీఆర్ తప్ప. 4 కోట్ల మంది తోబుట్టువులను దగ్గర ఉండి చూసుకుంటున్నది కేసీఆర్ కాదా.? అంటూ ప్రశ్నించారు.
కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్నది కేసీఆర్ కాదా? అంటూ ప్రశ్నించారు. గురుకులాలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు తెరిచి లక్షలాది మందికి నాణ్యమైన విద్య అందిస్తున్నది కేసీఆర్ కాదా? ఊహించని విషాదంతో ఒంటరిగా మిగిలిన చెల్లెళ్లకు ఒంటరి మహిళ పెన్షన్లు ఇస్తున్నది వాళ్ల పెద్దన్న కేసీఆర్ కాదా? అంటూ నిలదీశారు.
ప్రత్యేక రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అనుమానాలను పటాపంచెలు చూస్తూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని వివరించారు. ప్రతిపక్షమంటే పక్షపాతంగా వ్యవహరించాలని, ఎప్పుడూ విమర్శ చేయాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేతల పక్షపాత ధోరణి సరికాదని, దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా తెలంగాణ మారిందన్నారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేయవద్దని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాల పైచిలుకు మాగాణి వుందని, తెలంగాణలో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరిగిందని ప్రకటించారు.