Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విద్యా ప్ర‌మాణాల‌కు పెద్ద‌పీటకే ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం : కేటీఆర్

మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్‌లో కలియతిరిగారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్‌ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రం సిద్ధించిన త‌ర్వాత కేజీ టు పీజీ వ‌ర‌కు ఒకే ఆవ‌ర‌ణ‌లో నెల‌కొల్పుతామ‌ని 2004లోనే కేసీఆర్ చెప్పారు. ఆనాటి మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా విద్య‌కు పెద్ద‌పీట వేశామ‌న్నారు. కేజీ నుంచి పీజీ దాకా చ‌క్క‌టి ప్ర‌మాణాల‌తో బ్ర‌హ్మాండ‌మైన విద్య‌ను అందిస్తున్నాం. మ‌న పిల్ల‌ల‌ను ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా త‌యారు చేయాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

విద్యా ప్ర‌మాణాల‌కు పెద్ద‌పీట వేయాల‌న్న ఉద్దేశంతోనే మ‌న ఊరు -మ‌న బ‌డి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాం అని కేటీఆర్ పేర్కొన్నారు. నాయ‌కుడికి మ‌న‌సు ఉంటే ఎలాంటి ప‌నులు జ‌రుగుతాయ‌న‌డానికి ఇలాంటి కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌నం. డైనింగ్ హాల్ అద్భుతంగా నిర్మించారని కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠ‌శాల‌లు స్థాపించామని, గురుకుల విద్యార్థుల‌కు సంబంధించి ఒక్కొక్క‌రిపై రూ. ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు పెడుతున్నామని అన్నారు. విద్య అనేది మ‌న నుంచి దొంగిలించ‌లేని ఒక అపురూప‌మైన వ‌స్తువు అని, విద్య ద్వారా స‌మ‌కూరే జ్ఞానాన్ని ఎవ‌రూ కూడా త‌స్క‌రించ‌లేరని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌న ఊరు – మ‌న బ‌డి పేరిట రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌ను మూడు ద‌శ‌ల్లో అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.

Related Posts

Latest News Updates