తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. పాత బస్తీని ఎందుకు డెవలప్ చేయడం లేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హామీలు ఇచ్చేస్తారని, అమలు చేసే విషయంలో మాత్రం అలసత్వమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవ్వర్నీ కలవరని, పాతబస్తీకి మెట్రో రైలు ఏమైందని నిలదీశారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఇన్నేళ్లుగా జరుగుతుంటే ప్రజలకు ఏం చెప్పాలి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ మెట్రో ఏమైంది ? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని ఆరోపించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు వున్న పార్టీకి ఎక్కువ సమయం సబబుకాదన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం వుండదని కౌంటర్ ఒచ్చారు. సభా నాయకుడు బీఏసీకి రాలేదని, నిందా పూర్వకంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీకి వెళ్ళారని, అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని తెలిపారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం కూడా భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారని చెప్పారు.
కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా… తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్శాత్మక కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు.