శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయంలో మాత్రమే స్పర్శ దర్శనం కల్పించగా సామాన్య భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలను వివిధ స్లాట్ట ద్వారా కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇరుముడితో వచ్చే శివస్వాములకు చంద్రావతి కళ్యాణ మండపంలో 4 కంపార్ట్‌మెంట్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలను కల్పిస్తున్నారు. అదేవిధంగా కాళినడకన వచ్చే భక్తులను గుర్తించి వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలను కల్పించడం కోసం ప్రత్యేక కంకణాలను ఇస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా శీఘ్ర, అతి శీఘ్ర, ఉచిత దర్శనాలకు బుకింగ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
11 రోజులపాటు జరిగే ఉత్సవాలకు 5 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించినట్లు ఈవో లవన్న చెప్పారు. అదే విధంగా క్షేత్ర పరిధిలో యాత్రికులు ఎటువంటి అవస్థలకు గురవుతున్నా కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్లు 08524 – 287004, 28728, 287289 లకు ఫోన్ చేసి క్లుప్తంగా చెప్పాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ప్రకటించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లు, అడుగడుగున ఈ టాయిలెట్స్, మంచినీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలతో పాటు అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు పేర్కోన్నారు.