ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు తీసుకెళ్లనున్నారు. లాలూ ప్రసాద్ తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోవడంతో ఆయన కుడిభుజం ఎముక విరిగిపోయింది. దీంతో ఆయన్ను పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబీకులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఈ విషయాన్ని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
భుజం విరగడంతో పాటు లాలూకు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వున్నాయని కుటుంబీకులు తెలిపారు. ఎయిమ్స్ లో నయం కాని పక్షంలో సింగపూర్ కు చికిత్స కోసం తీసుకెళ్తామని కుటుంబీకులు ప్రకటించారు. మరోవైపు పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో లాలూ చికిత్స పొందుతున్న సమయంలో బిహార్ సీఎం నితీశ్ పరామర్శించారు. లాలూ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లాలూ చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని సీఎం నితీశ్ ప్రకటించారు.