తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశం అయ్యారు. 52వ ఎన్నారై టీఆర్‌ఎస్ చెక్ రిపబ్లికన్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఇది టీఆర్‌ఎస్ పార్టీకి 52వ ఎన్నారై శాఖ అని ఆయన పేర్కొన్నారు. మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఏ ఎన్నారైని అడిగినా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని ఆయన తెలిపారు. మోదీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఆర్థిక సాయం చేయక పోగా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
