‘లా నేస్తం’ పథకంలో భాగంగా అర్హులైన 2.011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం 1,00,55,000 రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి, ఆ మొత్తాన్ని న్యాయాదుల ఖాతాల్లోనే జమ చేశారు. ఇకపై లా నేస్తం అనే పథకాన్ని యేడాదికి రెండు సార్లు అందిస్తామని ప్రకటించారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామని జగన్ తెలిపారు.
గత మూడేళ్లలో 4,248 మంది లాయర్లకు లా నేస్తం అందించామని, ఇప్పటి వరకూ 35.40 కోట్లు అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,011 మంది లాయర్లకు లా నేస్తం అందిస్తున్నామన్నారు. న్యాయవాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు వుంటాయని పాదయాత్ర సమయంలో చెప్పారని, అందుకే దీనిని ప్రవేశపెట్టామని జగన్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా దీనిని అమలు చేస్తున్నామని అన్నారు. ఒక్కరు కూడా మిస్ కాకూడదన్న ఉద్దేశంతోనే అమలు చేస్తున్నామని తెలిపారు.