లోన్ రికవరీ ఏజెంట్లు అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీఐపీలను కూడా బెదిరించేస్తున్నారు. ఇక.. మాములు ప్రజల గతి చెప్పాల్సిన అవసరమే లేదు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్యులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా… లోన్ రికవరీ ఏజెంట్లు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా వేధించారు. లోన్ తీసుకున్న వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని, దయచేసి తనకు ఫోన్లు చేయవద్దని మర్యాదపూర్వకంగానే చెప్పారు. అయినా.. పదే పదే ఫోన్లు చేయడం ప్రారంభించారు.
మొదట అశోక్ కుమార్ అనే వ్యక్తి మీ నెంబర్ ను ప్రత్యామ్నాయంగా ఇచ్చారని ఆ మహిళ ఎమ్మెల్యేకు చెప్పింది. అతనెవరో తనకు తెలియదని, వీలైతే పోలీస్ లకు ఫిర్యాదు చేయండని కూడా చెప్పారు. అయినా.. మహిళ వినకుండా పదే పదే ఫోన్లు చేసింది. దీంతో విసుగెత్తిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన శైలిలో మాట్లాడారు. ఆ మహిళ కూడా అదే రేంజ్ లో మాట్లాడింది. ఇలా కుదరదని భావించిన ఎమ్మెల్యే.. చివరికి పోలీసులకు అప్పగించారు. ఆ ఏజెంట్లకు బేడీలు వేసి, పోలీసులు అరెస్ట్ చేశారు.