పాదయాత్ర అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ, లోక్‌సభలో స్పీకర్‌గానీ, రాజ్యసభలో చైర్మన్‌గానీ వారి డిమాండ్స్‌ను అంగీకరించలేదు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లోకసభ లో స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి, నిరసన వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది.
వెల్ లోకి దూసుకెళ్లి, విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇలా పోడియంలోకి దూసుకొచ్చి… నిరసన వ్యక్తం చేయడం సరైన విధానం కాదని, సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ కోరారు. అయినా….. విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలూ మధ్యాహ్నం 2 వరకూ వాయిదపడ్డాయి. వాయిదా అనంతరం సభలు ప్రారంభమైనప్పటికీ, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నినాదాల జోరు కొనసాగింది. రాజ్యసభలో ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లాలంటూ చైర్మన్ ధన్‌కడ్ చేసిన విజ్ఞప్తిని ఎవరూ లెక్కచేయలేదు.
మరోవైపు అదానీ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారం ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన విధానంతో ఆధారపడి వున్న అంశమని, అందుకే ప్రధాని స్పందించాలని కోరారు. ప్రధాని మోదీ స్పందించేంత వరకూ నిరసన కొనసాగుతూనే వుంటుందని దిగ్విజయ్ ప్రకటించారు.