LTTE అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారా? అతి త్వరలోనే బహిరంగంగా అందరికీ కనిపించనున్నారా? త్వరలోనే బయటకు వస్తారా? ఎంత నిజమో తెలియదు కానీ… ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ మాత్రం ఇవన్నీ నిజమేనని అంటున్నారు. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారని బాంబు పేల్చారు. ప్రభాకరన్ సజీవంగా, క్షేమంగా వున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని ప్రకటించారు. తంజావూరులో మీడియాతో మాట్లాడారు. తమిళుల మెరుగైన జీవనం కోసం ఓ ప్రకటన చేస్తారన్నారు. అయితే.. ప్రభాకరన్ అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇక… ఇప్పటికీ ప్రభాకరన్ కుటుంబీకులతో టచ్ లోనే వున్నారని, అయితే ప్రస్తుతం ఎక్కడున్నారో మాత్రం చెప్పలేనని పేర్కొన్నారు.
స్పందించిన కాంగ్రెస్
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఈ ప్రకటనపై తనదైన శైలిలో స్పందించారు. ‘వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా..? అయితే చాలా సంతోషం. పజా నెడుమారెన్ నాకు ప్రభాకరన్‌ను చూపిస్తానంటే, నేను వెళ్లి అతడిని చూసొస్తా. ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
1976 లో LTTE ని స్థాపించిన ప్రభాకరన్
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)ను వేలుపిల్లై ప్రభాకరన్ 1976లో స్థాపించాడు. సింహళుల ఆధిపత్య శ్రీలంక ప్రభుత్వం, సింహళ పౌరులు తమపై విపక్ష చూపుతున్నారంటూ తమిళులకు స్వయంప్రతిపత్తి కోసం ఎల్‌టీటీఈ పిలుపునిచ్చింది. క్రమంగా అది గెరిల్లా పోరాటంగా మారింది. 1983లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్‌పై గెరిల్లా దాడి జరగడంతో 13 మంది సైనికులు మరణించారు. దీంతో ఎల్‌టీటీఐపై ఉగ్రవాద ముద్ర సంస్థగా శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది.