మనుషులను కరోనా వెంటాడుతుంటే.. గుజరాత్ లో పశువులను లంపి అనే చర్మ వ్యాధి వెంటాడుతోంది. ఈ లంపి అనే చర్మ వ్యాధి కారణంగా గుజరాత్ లోని 15 జిల్లాల్లో 1000 కి పైగా పశువులు మరణించాయి. ఆవులు, గేదెలు చర్మ వ్యాధితో మరణిస్తుండటంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. లంపి చర్మ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వైరస్ నుంచి జంతువులను ఎలా కాపాడాలో చర్చించారు. ఇప్పటికి దాదాపు 2 లక్షలకు పైగా జంతువులకు వ్యాక్సిన్ కూడా వేశారు. వెటర్నటీ వైద్యులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ వ్యాక్సిన్ ద్వారా లంపి చర్మ వ్యాధికి అడ్డుకట్ట వేయచ్చా? అని ఆలోచిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ లో కూడా ఈ వ్యాధి వున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్రం నుంచి పలువురు అధికారులు గుజరాత్, రాజస్థాన్ కు వెళ్లారు.
లంపీ అనే వ్యాధి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఈగలు, పేనులు, కందిరీగల ద్వారా పశువులకు సోకుతుంది. అంతేకాకుండా కలుషితమైన నీటి ద్వారా కూడా వాటికి సోకుతుంది. ఈ వ్యాధితో జంతువుల్లో విపరీతమైన జ్వరం వస్తుంది. కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, నోటి నుంచి లాలాజలం కారడం జరుగుతుంది. వీటితో పాటు పాల ఉత్పత్తి అమాంతం పడిపోతుంది. శరీరంపై పుండ్లు లాగావచ్చి, జంతువు మరణిస్తుంది.