భూకంపాల లాంటి భారీ విపత్తులు సంభవించిన వేళ ఫిజియోథెరపిస్టుల పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి సమయాల్లోనే ఫిజియోథెరపిస్టులు ఆశాకిరణాలుగా మారతారని అన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ జాతీయ సదస్సుకి మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. టర్కీ, సిరియా భూకంపం నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలు, విపత్తుల్లో గాయపడినప్పుడు బాధితులకు కేవలం శారీరక బాధ మాత్రమే కాదు.. మానసిక సవాళ్లు కూడా వస్తాయని, అలాంటి సమయంలో ఫిజియో వైద్యం అందించి, వారికి ఊరటనిస్తారని వివరించారు. వారికి కొత్త జీవితంపై ఆశను రేకెత్తిస్తారని అన్నారు.
భూకంపం వచ్చి ఆరు రోజులైనా.. ఇంకా టర్కీ, సిరియాలో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. .. బాధితుల రోదనలు.. వేలాది మంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతుంటడం అత్యంత బాధ కలిగిస్తోంది. టర్కీలో 20,213 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. మరో 77,711 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక సిరియాలో 3,553 మంది మృతి చెందారు. శిథిలాలు తవ్వుతున్నకొద్దీ, బయటపడుతున్న మృతదేహాలను సమాధి చేస్తున్నారు. 1990 తర్వాత ఇంత పెద్ద విపత్తు ఇప్పుడే సంభవించింది. భూకంపంతో ఇంతమంది చనిపోవడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు టర్కీ అధికారులు చెప్తున్నారు.