బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం యాదగిరి గుట్ట నుంచి ప్రారంభమైంది. ఈ సభకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. ఇంజినీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్ లు మునిగాయని , కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని కేంద్ర మంత్రి షెకావత్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ సైరన్ మగిందని, వచ్చే ఎన్నికల్లో సంజయ్ సారథ్యంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, సుష్మా స్వరాజ్ పోరాటం చేశారని గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తు చేశారు.
ఇక.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహ స్వామి అవతారమెత్తి, కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఫ్రీ యూరియా ఇస్తానని పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు.