మహారాష్ట్ర రైతుల దీక్షకు షిండే సర్కార్ తలవంచక తప్పలేదు. పది వేల మంది రైతులు, రెండువందల కిలోమీటర్ల పాదయాత్ర. అరికాళ్లు బొబ్బలెక్కినా, పుండ్లుపడి బాధించినా, ఉద్యమం మధ్యలోనే ఓ రైతు మృత్యువాత పడినా, ఒక్కరంటే ఒక్క రైతు కూడా వెనక్కి తగ్గలేదు. సంఘటిత పోరాటానికి ఎంతటి శక్తి ఉంటదో నలుదిశలా చాటారు. వారం క్రితం మహారాష్ట్రలోని దిండోరి నుంచి ముంబై వరకు కొనసాగుతున్న లాంగ్‌మార్చ్ వసింద్‌కు చేరుకోగానే తీపికబురందింది. వారి డిమాండ్లను అంగీకరిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు రైతుసంఘాల నాయకులు వెల్లడించారు. అటవీహక్కులు, ఆలయ ట్రస్టులకు చెందిన భూముల బదిలీ, మద్దతు ధర తదితర 14 డిమాండ్లతో మహారాష్ట్రలో అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్రకు సీఎం ఏక్‌నాథ్ షిండే దిగొచ్చారు. వారి డిమాండ్లన్నీ అంగీకరిస్తూ అసెంబ్లీలో ప్రకటించారు.